హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ప్రారంభమైంది. మొదట సికింద్రాబాద్ చేరుకున్న మోదీ.. అక్కడ 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ ఇతర నేతలతో కలిసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వనీ వైష్ణవ్‌తో కలిసి పాల్గొన్నారు. సభా వేదిక పైనుంచి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం తెలిపారు. ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంకటేశ్వరస్వామి విగ్రహం అందజేశారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం. తెలంగాణకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని వచ్చారు. ప్రతి కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోరుకుంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం వందేభారత్ రైలు అందించారు. దేశంలో 14వ వందేభారత్ రైలును ప్రారంభించుకున్నాం. 14 వందేభారత్ రైళ్లలో 2 తెలుగు రాష్ట్రాలకే వచ్చాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం’ అని అన్నారు.