తనకు మంత్రి కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ అవసరమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఉదయం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి అసమర్థుడు, మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని జీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారన్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో, 3న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.
కవులకు, కళాకారులకు. విద్యావంతులకు.. మేధావులకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ.. కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తున్న వాళ్లు.. వారికి సేవ చేసే వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనన్నారు. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదన్నారు. రాష్ట్రంలో అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటనీ విమర్శించారు. 17సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయన్నారు.