ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలయింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గుడివాడలో స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఎన్నికల కమీషనర్ పై ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేసారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గు లేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలను కోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదు అని ఆయన విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్నా నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తి కారణమవుతుంది అని హెచ్చరించారు.