గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న నేత కొడాలి నాని. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి శాఖ పరంగా పని ఎలా చేస్తున్నారు తెలియదు గానీ, అధికార పార్టీ నేతగా ప్రతిపక్ష టీడీపీపై మాత్రం మాటలతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేతలు తమ ప్రభుత్వం మీద చేసే విమర్శలకు, ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు…బూతులతో చంద్రబాబు అండ్ బ్యాచ్‌కు చెక్ పెడుతున్నారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా పరుషపదజాలంతో దూషిస్తున్నారు.
అయితే ఇలా బూతులతో విరుచుకుపడుతూనే నాని, టీడీపీకి పరోక్షంగా కొన్ని కీలక సలహాలు కూడా ఇస్తున్నట్లు కనిపిస్తోది. ఈ మధ్య నాని అమరావతి భూ కుంభకోణంపై మాట్లాడుతూ, చంద్రబాబుపై విమర్శలు చేశారు. అలాగే దీనిపై కేంద్రం సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాకపోతే నారా లోకేష్‌పై కూడా స్పందిస్తూ, అతని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అన్నట్లుగానే చెప్పారు. కానీ ఈ క్రమంలోనే టీడీపీకి ఓ చిన్న మాట సాయం కూడా చేశారు.
చంద్రబాబుకు వయసు మీద పడింది, పైగా కరోనా సమయం కాబట్టి హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్నారని, మరి యువకుడైన లోకేష్‌కు ఏం వచ్చిందని విమర్శించారు. లోకేష్ ఏపీకి వచ్చి పార్టీని నడిపించవచ్చు కదా అన్నట్లుగా మాట్లాడారు. అంటే పరోక్షంగా టీడీపీని నిలబెట్టుకోమని లోకేష్‌కు, నాని సలహా ఇచ్చారనే చెప్పొచ్చు. అయితే లోకేష్ గానీ, చంద్రబాబు గానీ హైదరాబాద్ నుంచే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
ఏదో సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, జూంప్ యాప్‌లో పార్టీని నడిపించడం తప్పా, డైరక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు. దీని వల్ల టీడీపీ కేడర్ కూడా నీరసపడిపోయి ఉంది. అటు నాయకులు వరుస పెట్టి పార్టీకి షాక్‌లు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చినబాబు కొడాలి మాటలు వింటే బెటర్ ఏమో ? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
-Vuyyuru Subhash