ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం కొడంగల్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్‌రెడ్డి తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈ వైరిపక్షాలకు చెందిన నేతలిద్దరి మధ్య మళ్లీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య మాటల హీట్ తో కొడంగల్ రాజకీయం మళ్లీ హీటెక్కింది.
ఆ మధ్య ఏపీలో దేవుళ్లపై ప్రమాణం చేద్దాం రా అని నేతలు హడావిడి చేసినట్టుగానే ఇక్కడ కూడా అదే పంచాయితీ రగిలిస్తున్నారు. పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేద్దాం అని ఒకరంటే.. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదాం అని మరొకరు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విటర్, వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు, కామెంట్స్ ఊదరగొడుతున్నారు. దీంతో కొడంగల్ రాజకీయం మళ్లీ రాజుకుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొడంగల్ అభివృద్ధికి నిధులు విడుదల చేసినట్టు ప్రచారం చేస్తోంది టీఆర్‌ఎస్. కేటీఆర్ దత్తత సెగ్మెంట్ అయిన కొడంగల్‌లో ప్రగతి పరుగు పెడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అధికారపార్టీ నేతలు. ఈ ప్రచారానికి సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఇస్తోంది రేవంత్‌రెడ్డి అండ్ టీమ్. అభివృద్ధి అయినా.. ఆత్మగౌరవమైనా రేవంత్ హయాంలోనే అని.. 2019 జనవరి తర్వాత ఒక్క పథకం కూడా రాలేదని కౌంటర్ ఇస్తున్నారు. అలా పథకాలు ఏమైనా వచ్చినట్టు ఉంటే.. పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి జీవోలు చూపించాలని సవాళ్లు విసురుతున్నారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి.. మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచినా కొడంగల్‌పై పట్టు తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారట రేవంత్‌రెడ్డి. అనుచరులతో నిత్యం టచ్‌లో ఉండటంతోపాటు.. ఇక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఆయన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి పోటీ చేసేలా జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే అధికార పార్టీ నేతలపై తరచు విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌ను ఆ కోణంలోనే చూడాలన్నది స్థానికులు చెప్పేమాట.
మాటలకే పరిమితమైతే బాగోదని అనుకున్నారో ఏమో కొడంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు బయలుదేరారు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు. వీరిని కోస్గిలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయినా రాజకీయ వేడిని లైవ్‌లోనే ఉంచేందుకు రెండు పార్టీల నేతలు నిర్ణయించారట.