నేడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? అన్న ప్రశ్నకి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో కొనసాగాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని అదే బలం అనుకుంటుందని టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్న ఆయన.. నియోజకవర్గ అభివృద్ధికి అధికంగా నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అన్నారు. వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి సారిస్తానన్నారు కోమటిరెడ్డి. అలాగే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు.