తెలంగాణలో ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకుల కోసం కాకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చివరిసారి 1983లో గెలిచింది. భువనగిరిలో నలభై ఏళ్ల చరిత్ర తిరగరాయాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఎంత కష్టపడాలన్నా ఎన్నికలకు మరో 33 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అయిదేళ్లు మీ కోసం మేమంతా కష్టపడతామన్నారు. తనకున్న 27 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని, కాంగ్రెస్ గెలుపు మీ బాధ్యతే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అనిల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. నాడు తెలంగాణ ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.