“బాబు వద్దు.. ఉత్తరాంధ్ర ముద్దు” అంటోన్న టీడీపీ నేత!

-

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం కొందరి నాయకులకు ఏమాత్రం మింగుడు పడకపోతే.. మరికొందరికి అదో అవకాశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర నాయకులు.. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నాయకులు.. ఇప్పుడు జగన్ వెంట నడిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ లిస్ట్ రోజు రోజుకీ పెరిగిపోతుందనే కథనాలొస్తోన్న తరునంలో… మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది!

అవును… శ్రీకాకుళం జిల్లా రాజాం టీడీపీ కీలక నేత కొండ్రు మురళి.. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని బలంగా స్వాగతిస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న మురళిని.. 2019లో టీడీపీలోకి తీసుకొచ్చిన బాబు ఖచ్చితంగా గెలుపొందుతారని ఊహించారు. అయితే గతకాలపు కాంగ్రెస్ వాసనలు అదే స్థాయిలో మెయింటైన్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో వర్గ విభేదాలకు దారితీసింది. ఫలితంగా వైసీపీ నేత అయిన కంబాల జోగులకు సునాయాస విజయాన్ని అందించింది.

ఆ తర్వాత 2019 ఎన్నికలైన మరుసటి రోజు నుంచే ఆ నియోజక వర్గ ప్రజలకు కొండ్రు మురళి గాయబ్ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల పేరు ప్రస్తావించిన వెంటనే.. కొండ్రు మురళి “మంచి నిర్ణయం” అంటూ స్వాగతించారు. అలా టీడీపీకి దూరమయ్యారని.. వైసీపీలో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని కూడా ఆ తర్వాత టాక్ నడిచింది. కానీ.. ఇప్పుడు నియోజక వర్గానికి దూరంగా ఉంటున్న కొండ్రు మురళి.. వైసీపీలో చేరుతారా లేదా అన్నది మాత్రం ప్రస్తావన రావడం లేదుగానీ.. తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజాంకు రాకుండా.. తన సొంత పనులపై పొరుగు జిల్లాలోనే ఉండిపోతున్నారట కొండ్రు మురళీ. దీంతో పార్టీ సమస్యలు.. ఇతర అంశాలను ఎవరికి చెప్పుకోవాలో టీడీపీ కేడర్‌కు తెలియడం లేదమే టాక్ కూడా నడుస్తోంది. ఎన్నికల ముందు వరకూ రాజాం పాలిటిక్స్‌లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తలదూర్చే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావ్ కూడా కరోనా సమయంలో అటువైపుగా చూడటం కూడా మానేశారు. ఒకప్పుడు వర్గ విబేధాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాజాంలో ఇప్పుడు ఏ వర్గానికీ ఓ దిక్కంటూ లేని పరిస్థితి నెలకొని ఉంది.

మరి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాం విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా మూడు రాజధానులు తెచ్చిన తంటా చంద్రబాబును తీవ్ర ఇరకాటంలోకి నెట్టినట్లైంది. అక్కడి నేతలంతా బాబు వద్దు ఉత్తరాంధ్ర ముద్దు అంటూ దూరంగా పోతున్నారనే టాక్ కూడ నడుస్తోంది. మరి ఈ సమయంలో బాబు ఉత్తరాంధ్రపై ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news