గత వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో కురిస్తున్న వర్షాలకు చెరువులు నిండిపోయాయి. మత్తడి పోస్తున్నాయి. దీంతో గ్రామాల్లోకి వరద నీరు చేరుకొని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు మంత్రి ఆదేశించారు.
గతవారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న తాజా పరిస్థితులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుతో సమన్వయం చేసుకుంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయటక వెళ్లొద్దన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.