తెలంగాణ రాజకీయాలు మరోసారి కాకపుట్టాయి. కొన్ని రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఈటల్లాంటి మాటలతో నాయకులు విరుచుకుపడుతున్నారు.ఇందులో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలిస్తే ఆయన కుమారుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొంత సున్నితంగానే చురకలు అంటిస్తారు. భాష విషయంలో కాస్తంత కంట్రోల్ లోనే ఉంటారు. మరెందుకో కొద్దిరోజులుగా ఆయన కూడా ప్రత్యర్థులపై తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.
తన తండ్రిని పూనినట్లుగా కేటీఆర్ కూడా అంతెత్తున లేస్తున్నారు. వరంగల్ లో జరిగిన సభలో అయితే ఏకంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ‘తిట్టలేమా’ .. అని అంటూనే తిట్టేశారు. బట్జేబాజ్, లుచ్చాగాడు అని అనలేమా…? అంటూనే అనేశారు. తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో అయితే మరింతగా రెచ్చిపోయారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని అరెస్టు ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ‘అవును. మోదీవి గాంధీ మాటలు. గాడ్సే చేతలే. మేవానిని అరెస్టు చేశారు కదా. దమ్ముంటే నన్ను కూడా అరెస్టు చేయండి. చూద్దాం. అటో ఇటో తేల్చుకుందాం’ అంటూ తొడగొట్టారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై కేంద్రం తీరును ఎండగడుతూ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. గతంలో ఈ స్థాయిలో కేటీఆర్ విరుచుకుపడిన దాఖలాలు అయితే లేవు.
ఏదో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపుతోంది.. మాకొచ్చిన ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించుకుపోయారు.. ప్రధాని మోదీ దేశ ప్రధాని కాదు.. గుజరాత్ ప్రధాని.. అంటూ మర్యాదపూర్వకమైన.. ఎవరినీ నొప్పించని.. తగు జాగ్రత్తలతో కూడిన భాషలోనే విమర్శలు చేసేవారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయంలోనూ సంయమనంతోనే ఆరోపణలు గుప్పించేవారు. అంతేగానీ.. తొడగొట్టడాలు.. సవాళ్లు విసరడాలు ఉండేవి కావు.
మరి అకస్మాత్తుగా కేటీఆర్ టోన్ ఎందుకు మారింది? కేసీఆర్ ను మించి మాటల ఘర్జన చేస్తున్నారెందుకు? మొత్తంగా చూస్తుంటే రాజకీయంగా బీజేపీ నుంచి ఏదో సెగ తగులుతున్నట్లే అనిపిస్తోంది. పీకే సర్వేలో ఇందుకు సంబంధించి ఏమైనా వ్యూహం ఉందేమో? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమయినా మరి ఈ శివతాండవాలు.. అరభీకర గాండ్రింపులు.. ఘర్జనలు పార్టీకి ఎంత వరకు లాభిస్తాయో వేచి చూడాల్సిందే.