సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కానీయమని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిని కార్పొరేట్లకు కట్టబెట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని పేర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో గుజరాత్ పట్ల ప్రేమకురిపిస్తున్న కేంద్రం…రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందని అన్నారు.
భయ్యారం విషయంలోనూ కేంద్రం మాటతప్పిందన్న మంత్రి… ముడి ఇనుములో నాణ్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం ముందుకురాకపోతే సింగరేణి ద్వారా లేదా ప్రైవేట్ రంగం ద్వారా పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి.. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా…రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదని ఆరోపించారు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా… కేంద్రానికి మనసు రావటం లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్న మంత్రి…రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారిన మతపరమైన నిర్మాణాల విషయంలోనూ చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.