కర్నూలులో రాజీ పడిన నేతలంతా రెచ్చిపోతున్నారా ?

-

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మళ్లీ ప్రాణం పోసుకుంటుందా?పదేళ్లకు పైగా తెరమరుగైపోయిన ముఠా కక్షలు మళ్లీ చెలరేగుతున్నాయా?రాజీ పడిన వాళ్లంతా మళ్లీ కసి తీర్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారా?జిల్లాలో తుపాకుల సంస్కృతి మళ్లీ తెరపైకి వస్తుందా?అసలు..కర్నూలు జిల్లాలో ఏం జరుగుతోంది?

నిజానికి…కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాలు ఫ్యాక్షన్‌తోనే ప్రసిద్ధికెక్కాయి. ఆళ్లగడ్డ అంటే బాంబుల గడ్డ అనే వారు. కప్పట్రాళ్ల, కోటకొండ, చిందుకూరు, చింతకుంట, రేవణూరు, మంచాలకట్ట, పత్తికొండ వంటి ప్రాంతాల పేర్లు ఫ్యాక్షన్ హత్యలతోనే మార్మోగిపోయాయి. ఒక్కో గ్రామంలో 50కి పైగా హత్యలు జరిగాయి. కప్పట్రాళ్ల, కోటకొండ గ్రామాల్లో కలిపి వందకు పైగానే హత్యలు జరిగాయి. 2001 కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ప్రత్యర్థులు ఒకేసారి ఆరుగురు హత్యకు గురయ్యారు. 2008లో వెంకటప్పనాయుడు సహా 12 మందిని సినీ ఫక్కీలో లారీతో ఢీకొట్టించి హత్య చేశారు.

కర్నూలు జిల్లాలో కొందరు మహిళలు తమ భర్త హత్యకు గురైతే ప్రత్యర్థిని హత్య చేసేవరకు మంగళసూత్రాలు, బొట్టు తీసేది లేదని ప్రతిజ్ఞ చేసి తమ లక్ష్యాన్ని సాధించినవారు ఉన్నారు. భర్తను హత్య చేసిన ప్రత్యర్థులను హత్య చేసి శవాల వద్ద చిందులేసిన మహిళలూ ఉన్నారు. ఫ్యాక్షన్‌లో కుటుంబ పెద్దలను కోల్పోయి దిక్కుమొక్కు లేకుండా పూటగడవని స్థితిలో పిల్లలను పోషించలేని అనాథలైన మహిళలు వందల సంఖ్యలోనే ఉన్నారు. కర్నూలు ఫ్యాక్షన్‌కు బలైన వారిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మాజీ మంత్రులు సైతం ఉన్నారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటికీ అక్కడక్కడా ఫ్యాక్షన్ జడలు విప్పుతోంది. ఒకరిద్దరు హత్యలకు గురవుతూనే ఉన్నారు. అయితే గతంలో కంటే ఫ్యాక్షన్ నేతల్లో చాలా వరకు మార్పు వచ్చింది. ఫ్యాక్షన్ నేతలు వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఫ్యాక్షన్‌లో పడి ఈ అస్తులు అనుభవించకుండా ప్రాణాలు కోల్పోవాలా?అనే ఆలోచనలో పడిపోయారు. పోయిన వాళ్లు ఎలాగూ తిరిగిరారు. జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటున్నారు. కాస్త ప్రశాంతంగా బతుకుదాం….సంపాదించిన ఆస్తులను అనుభవిద్దామని అనుకుంటున్నారు.

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తెరమరుగవుతున్న తరుణంలో తుగ్గలి మండలం కడమకుంట్లకు చెందిన రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తిపై వైసీపీకి చెందిన అమర్‌నాథ్ రెడ్డి సినీ ఫక్కీలో హత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పత్తికొండ-చిన్నహుల్తీ రహదారిలో టీకొట్టు వద్ద రాంభూపాల్ రెడ్డి ఉండగా అమరనాథ్ రెడ్డి జీపుతో ఢీకొట్టి..తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారు. ఇనుప రాడ్లతో దాడి చేశారు. కర్నూలు జిల్లాలో పూర్తిగా ఫ్యాక్షన్ అదుపులో ఉన్న పరిస్థితుల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news