Breaking : సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు..

-

సోదరి, సోదరుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే మొదలైంది. అయితే.. కొన్ని చోట్ల పండుగ నేడు జరుపుకుంటుంటే.. మరి కొన్ని చోట్ల రేపు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాఖీ పండుగను పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్‌ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా… మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్‌కు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టిన వారిలో మంత్రులు తానేటి వనిత, విడదల రజనితో పాటు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి ఉన్నారు. ఏపీ సీఎం జగన్‌కు బ్రహ్మకుమారీలు కూడా వచ్చి రాఖీలు కట్టారు.

ఏపీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలకు సీఎం జగన్‌ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ట్విట్టర్‌ ద్వారా ‘రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు రాఖీ శుభాకాంక్షలు‘ తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news