ఆంధ్రా అక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్‌కు పేరున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈయన చేసిన సర్వేలు కరెక్ట్ అవుతాయని చెప్పి ఆ పేరు వచ్చింది. అయితే అది 2018కు ముందు..ఆ తర్వాత మాత్రం ఆయన సర్వేలు నిజం అవ్వలేదు. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాల్లో కనిపించడం మానేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
అది కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం. విజయవాడ ఎంపీ సీటులో పోటీ చేస్తారని టాక్. గతంలో లగడపాటి కాంగ్రెస్ తరుపున 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయవాడ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో ఈయన చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. ఇక పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సమయంలో ఈయన పెప్పర్ స్ప్రే ఘటన కూడా ఎవరూ మర్చిపోరు. కానీ రాష్ట్రం విడిపోవడంతో..ఈయన రాజకీయాలకు దూరం జరిగారు.
కాకపోతే సర్వేలు చేయించడం మాత్రం ఆపలేదు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో లగడపాటి సర్వే నిజమైంది. అంతకముందు 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. అది నిజమైంది. కానీ 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని సర్వే చేసి చెప్పారు. అప్పుడే లగడపాటి సర్వే తొలిసారి ఫెయిల్ అయింది. అనూహ్యంగా బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చింది.
2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పారు..కానీ వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ దెబ్బతో సర్వేలే చేయనని చెప్పేశారు. కాకపోతే సీక్రెట్ గా ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీలోకి రావాలని చూస్తున్నారని టాక్ వస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.