వేటాడే జంతువుల కంటే దోమలే డేంజర్‌ అంటున్న WHO.. ఏటా దోమకాటుకు 10 లక్షలు మంది బలి

-

సింహం, పాము, చిరుతపులి ఇవి మానవాళికి హానికరమైనవి మనం అనుకుంటాం.. అవును ఇవి డేంజరే.. అయితే ఇవి మన చుట్టుపక్కల ఉండవు. ఎక్కడో అడవుల్లో ఉంటాయి..కానీ వీటి కన్నా డేంజర్‌ అయినది మనతోనే మన ఇంట్లోనే ఉంది తెలుసా..? వీటివల్ల ఏటా.. ఏకంగా 10 లక్షల మంది చనిపోతున్నారట.. అవే దోమలు..

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక జీవులు మన ఇళ్లలో కనిపించే దోమలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఒక్క దోమల కారణంగానే ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారని తేలింది..

WHO ప్రకారం, పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. అదే సమయంలో.. కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 60 వేల మంది చనిపోతున్నారు.. ఇక సింహాలు, చిరుతలు లేదా పులుల దాడిలో కూడా ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఇన్ని మరణాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ అడవి జంతువుల దాడుల్లో కొన్ని వేలల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

మలేరియా అనేది దోమ కాటు వల్ల వచ్చే అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. మలేరియా చాలా కాలంగా మానవులకు ప్రాణాంతక వ్యాధిలా మారింది. అనాఫిలిస్ దోమలు ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా మలేరియాను వ్యాపిస్తాయి. ఈ వ్యాధి ఆఫ్రికా, దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించింది. WHO ప్రకారం, మలేరియా కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా మరణించారు.

చిన్నపిల్లలు, గర్భిణీలు తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి మలేరియా ప్రాణాంతకమే. ఆఫ్రికాలో 80 శాతం మలేరియా మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంభవిస్తాయని WHO చెప్తోంది. అంతే కాకుండా డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్‌, ఫైలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.

దోమలు వృద్ధి చెందాలంటే ముఖ్యమైనది నీరు. అదే సమయంలో మానవులు కూడా నీటిపై ఆధారపడతారు. అటువంటి పరిస్థితిలో.. ఇద్దరూ ఒకరితో ఒకరు జీవించవలసి వస్తుంది. ఆడ దోమ పునరుత్పత్తి కోసం మానవ రక్తాన్ని పీలుస్తుంది. ఆడ దోమ మానవ చర్మాన్ని కుట్టడం ద్వారా రక్తాన్ని పీల్చినప్పుడు, అది ఒక వ్యక్తి యొక్క రక్తప్రవాహంలో నుంచి మరొకరికి సూక్ష్మక్రిములను బదిలీ చేస్తుంది. దోమలు కుట్టినప్పుడు మనకు పెద్దగా నొప్పివేయదు కాబట్టి లైట్‌ తీసుకుంటాం.. కానీ ఒక్క దోమ కుట్టినా మీకు నష్టమే.! వీలైనంత వరకూ దోమలు కుట్టకుండా ఉండేలా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news