38 ఏళ్ల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.. తొమ్మిది నెలల్లోనే తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అలాంటి మహానాయకుడు స్థాపించిన పార్టీ, అలాంటి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీకి నేడు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయన్న అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి! ఆమె మాటలు కేసీఆర్, జగన్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించగా… బాబు ఫ్యాన్స్ కి మాత్రం మండేలా చేశాయి!!
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లకు దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మొదలుపెట్టిన లక్ష్మీపార్వతి… అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు లభించారని, అవి రాష్ట్రాలు చేసుకున్న పుణ్యమని అన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని తెలిపిన ఆమె తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజలను గుండెల్లో పెట్టికొని చూసుకుంటున్నారని ప్రశంసించారు! ఆన్ లైన్ లో మహానాడు చేశామన్న ఆనందం బాబుకు కాసేపు కూడా మిగలనియ్యకుండా… బాబు అత్తగారు లక్ష్మీపార్వతి చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం బాబుకు కాస్త ఇబ్బంది కలిగించేవే అని కచ్చితంగా చెప్పుకోవచ్చు!
లక్ష్మీపార్వతి అన్నారని కాదూ కానీ… నిజంగా బాబుకు పెద్దాయన ఆశీస్సులు ఉండవని, లేవనే అనుకోవాల్సిన పరిస్థితి! దానికి కారణం… వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న గౌరవం సంగతి కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం టీడీపీని బ్రతికుస్తున్నది మాత్రం ఎన్టీఆర్ విగ్రహాలు, ఫొటోలే అన్న విషయం కూడా బాబు మరిచిపోతున్నారని! ఆయన ఫోటోలు, విగ్రాహాలపై కాలం వెళ్లదీస్తున్నా కూడా… ఆయన ముద్ర చెరిపేసి, ఇది చంద్రబాబు పార్టీ అనే స్థాయిలో సైతం ఆలోచనలు చేస్తున్నారని! మధ్యపాననిషేధం గురించి ఎన్టీఆర్ కలలు కంటే… బెల్టు షాపులు పెట్టి మరీ మధ్యాన్ని ప్రోత్సహించి, రాష్ట్రానికి అదే ప్రధాన ఆర్ధిక వనరు అన్నట్లు తయారు చేశారని! అక్కడితో ఆగకుండా… తాను అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేరు తీసేసి, చంద్రన్న పేరున పథకాలు కూడా ప్రారంభించేశారు అని!
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ముఖ్యమంత్రి అయిన బాబు పాలన అలా ఉంటే… ఎన్టీఆర్ ఆశయమైన మద్యపాన నిషేధం బాధ్యతను జగన్ తీసుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ! ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! ఇది చాలాదా లక్ష్మీ పార్వతి ప్రశంసలు సరైనవే అనడానికి? ఈ విశ్లేషణలతో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై ఆన్ లైన్ వేదికగా కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి! స్వర్గీయ నందమూరి తారక రామారావు “ఆశీస్సులు జగన్ – కేసీఆర్ లకు అయితే… విగ్రహాలు మాత్రం బాబుకి” అంటూ కామెంట్స్ పడుతున్నాయి! ఎన్టీఆర్ ఆశయాలు బాబు.. నాడు, నేడు, ఏనాడూ, ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇలాంటి కామెంట్లకు ఆస్కారం అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!