జర్నలిస్ట్‌ జాబ్‌ వదిలేసి.. వ్యవసాయం.. నేడు సంవత్సరానికి రూ. 70 లక్షల ఆదాయం.!

-

కొన్ని ఏళ్ల నుంచి వ్యవసాయం చేసే రైతులే.. పెరిగిన ఈ ఖర్చులతో సాగు సాధ్యం కాదని క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నారు.. వ్యవసాయం పండగ అని ప్రభుత్వాలు చెప్పే మాటలు రికార్డులకే పరిమితం అవుతున్నాయి.. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో కథ వేరుంది. రైతులు వ్యవసాయం చేసి నానాటికి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ జర్నలిస్టు తన జాబ్‌ వదిలేసి మరి..వ్యవసాయం చేస్తున్నాడు. అయితే.. ఇతను మాత్రం ఆధునిక పద్దతిలో పంటలు పండిస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా..! ఆ కథేందో మనమూ చూద్దామా..!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి(Bareli) చెందిన రాంవీర్ సింగ్‌కు వృత్తి రీత్యా జర్నలిస్ట్‌. రామ్‌వీర్ సింగ్ స్నేహితుడి మేనమామకు 2009లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ బారిన పడడానికి కారణం కెమికల్‌తో కూడిన కూరగాయల వలన అని పరిశోధనలో తెలిసిందట… దీంతో రామ్‌వీర్ సింగ్‌లో భయం మొదలైంది. తన కుటుంబాన్ని అలాంటి ప్రమాదాల నుండి కాపాడాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యాడు.
తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్వీకులు ఇచ్చిన భూమిలో సేంద్రీయ కూరగాయలను పండించాలనుకున్నాడు.“పొలం బరేలీ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. దీంతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. వృత్తిగా వ్యవసాయ దారుడిగా మారి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం   మొదలుపెట్టాడు.

అలా మొదలైంది…

2017-18లో రామ్‌వీర్ సింగ్ వ్యవసాయ సంబంధిత కార్యక్రమంలో భాగంగా దుబాయ్‌లో హైడ్రోపోనిక్స్ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. ఈ వ్యవసాయ పద్ధతికి నేల అవసరం లేదు, తక్కువ కీటకాలతో సాగు చేయవచ్చు. అంతేకాదు మొక్కల పెరుగుదలకు అవసరమైన నీటిలో దాదాపు 80% ఆదా అవుతుందని తెలిసింది. దీంతో అక్కడే  రెండు వారాల పాటు రైతుల నుండి వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నాడు.
స్వగ్రామానికి వచ్చిన తర్వాత తన ఇంట్లో వ్యవసాయ పద్ధతులతో కూరగాయలను పండించాలని ప్రయత్నించాడు.. హైడ్రోపోనిక్స్ పొలాల పట్ల మక్కువతో వ్యవసాయం మొదలు పెట్టిన రామ్‌వీర్ సింగ్ ఇప్పుడు తన మూడంతస్తుల భవనాన్ని హైడ్రోపోనిక్స్ ఫామ్‌గా మార్చేశాడు. ఓ వైపు ఆరోగ్యకరమైన కూరగాయలను పొందుతూనే మరోవైపు ఏడాదికి లక్షల రూపాయలను ఆదాయంగా పొందుతున్నాడు.
తన భవనంలోని బాల్కనీలు , పైపులు , ఇతర పరికరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో హైడ్రోపోనిక్స్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇందుకు న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ (NFT), డీప్ ఫ్లో టెక్నాలజీని ఉపయోగించాడు. ఇప్పుడు 750 చదరపు మీటర్లలో 10,000 మొక్కలతో  వ్యవసాయం చేస్తున్నాడు. బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సీసా పొట్లకాయ, టమోటాలు, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీలు, మెంతులు , పచ్చి బఠానీలు అతను పండించే కొన్ని కూరగాయలు.

హైడ్రోపోనిక్స్ వ్యవసాయ పద్దతి అసలు మంచిదేనా..?

సేంద్రియ వ్యవసాయం కంటే హైడ్రోపోనిక్ వ్యవసాయం ఆరోగ్యకరమైనదని రామ్‌వీర్ అభిప్రాయపడ్డారు . “హైడ్రోపోనిక్స్‌లో పండించిన కూరగాయలు అధిక పోషకాహార శోషణ రేటును కలిగి ఉంటాయట. రసాయనిక వ్యవసాయం వలన నేల కలుషితమవుతుంది. అదే “హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో అటువంటి ప్రమాదం ఉండదుగా.. వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను స్థాపించిన రామ్‌వీర్ ఇప్పుడు సంవత్సరానికి రూ.70 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు.
వ్యవసాయానికి సాంకేతికతో జోడిస్తేనే…అది మంచి వ్యాపారంగా మారుతుందని ఎప్పటినుంచే.. నిపుణులు మొత్తుకుంటున్నారు. సంప్రదాయ పద్దతిలో సాగు సాగినంతకాలం.. రైతు బతుకుచితికిపోవాల్సిందే..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version