దేవాలయాల్లోకి యువతను ఆకర్షించేందుకు లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి గుడి నుంచి అవార్డును అందుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఆలయాలు దేవుని నామస్మరణ కోసం వచ్చే వృద్ధులకు మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలని అన్నారు.
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో వస్తారని నేను ఊహించాను, కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయ నిర్వాహకులు వారిని దేవాలయాల వైపు ఆకర్షించడానికి కృషి చేయాలి అని కోరారు. దేవాలయాలలో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా చదువుకోవాలనే యువత ఇక్కడికి వస్తారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చించి వారి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుంది అని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఆ దిశగా పని చేస్తే పెద్ద మార్పులు వస్తాయని అన్నారు.