తెలంగాణ రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 888 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ 4 రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు.
ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయం వద్దని సూచించారు. హైదారాబాద్‌లో 15 రోజులు లాక్ డౌన్ విధించడం మంచిదని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.