తెలంగాణ రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 888 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నిత్యావసరాల కొనుగోళ్లకు వీలుగా ఒకటి, రెండు గంటలే సడలింపు ఇచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అలాగే ప్రజా రవాణా రాకపోకలను ఆపాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అన్ని విషయాలు పరిశీలించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు. అయితే హైదారాబాద్ లో 15 రోజులు లాక్ డౌన్ విధించడం మంచిదని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు.