ఆఖరికి న్యాయమే గెలుస్తుంది: నారా లోకేశ్

-

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, కోర్టు తీర్పు నేపథ్యంలో అభ్యర్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించారు. ఆలస్యమైనా ఆఖరికి న్యాయమే గెలుస్తుందని విద్యార్థులకు లోకేశ్ భరోసా ఇచ్చారు. న్యాయం కోసం పోరాడిన గ్రూప్-1 అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. విద్యార్థులు చేసిన పోరాటంతో మొదటి విజయం సాధించారని లోకేశ్ అన్నారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఇంటర్వ్యూలు కూడా నిలిపివేసిందని పేర్కొన్నారు.

లోకేశ్ ఇంకా మాట్లాడుతూ ‘‘ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వేలాది మందికి తీరని అన్యాయం చేశారు. దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి చేసిన కుట్రలు బయటపడ్డాయి. వ్యాపం కుంభకోణం తరహాలోనే జగన్ రెడ్డి పాలనలో గ్రూప్-1 కుంభకోణం జరిగింది. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు అనే నినాదంతో మన పోరాటం కొనసాగుతుంది. విద్యార్థులు అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్లు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుందని లోకేశ్ తెలిపారు. డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత ఎన్‌వోపీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలి . ఎంపిక ప్రక్రియ, వేల్యూష‌న్‌పై అనుమానాలున్న‌వారి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి లేకపోతే అడ్డగోలుగా చేసిన తప్పులను న్యాయపరంగా ఎండగట్టి అంతిమ విజయం సాదిద్దాం. కోర్టు మొట్టికాయల తరువాత అయినా జగన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందని భావించాను. కానీ మార్పు రాలేదు.’’ అని నారా లోకేశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news