యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ‘మహాశక్తితో లోకేశ్’ పేరిట నారా లోకేశ్ ముఖాముఖి సమావేశమై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన ’10 రూపాయల డాక్టర్’ నూరి ఫర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… ఏపీ చరిత్రలో తొలిసారిగా రాజకీయాలు ఎంతో దిగజారిపోయాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే, మహిళలను అవమానించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు లోకేశ్.
“నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మహిళలకేం న్యాయం చేస్తాడు? 145 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్నాకే మహాశక్తి కార్యక్రమాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని అమలుచేసి తీరుతాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.