శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్, ఇతర అధికారులు.. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి.. ఏపీ సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు.. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.. శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తెలిపారు శ్రీలంక ప్రతినిధులు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని కలిసినట్లు శ్రీలంక ప్రతినిధులు తెలిపారు.. వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్‌లు వెల్లడించారు.. ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపథ్యంలో… శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని, ఖనిజవనరులు, పర్యాటకరం గంలో పెట్టుబడులుకు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తెలిపారు ప్రతినిధులు.