కరోనా వల్ల ప్రస్తుతం దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. తిరిగి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. వేరే కంపెనీలోకి మారుదామంటే అన్నికంపెనీల్లోనూ ప్రస్తుతం ఉద్యోగులను తొలగిస్తున్నారు. కనుక కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగం సంపాదించడం కష్టతరమవుతోంది. అయినప్పటికీ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లో ఉండే ఆ పనిచేయవచ్చు. కష్టపడే తత్వం, స్కిల్స్ ఉండాలే గానీ ఆన్ లైన్‌లోనే పలు పనులు చేసి డబ్బు సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇన్‌స్టాగ్రాం మార్కెటింగ్
ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా యాప్స్ లాగే ఇన్‌స్టాగ్రాం కూడా పాపులర్ అవుతోంది. ఇందులోనూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు. దీంతో చాలా కంపెనీలు, వ్యక్తులు తమ ప్రొడక్ట్స్ కు ఇందులో యాడ్స్ ఇస్తున్నాయి. అయితే ఇన్‌స్టా గ్రాం మార్కెటింగ్ చేస్తే ఆయా కంపెనీలు, వ్యక్తులకు వారి వారి ప్రొడక్ట్స్, సేవల గురించి ప్రమోషన్ చేయవచ్చు. వారికి పనిచేసి పెట్టి కమిషన్లు పొందవచ్చు. వారు అందించే ఉత్పత్తులు, సేవలను ఇన్‌స్టాగ్రాంలో ప్రమోట్ చేస్తే చాలు.. డబ్బులను వారి నుంచి కమిషన్‌గా అందుకోవచ్చు. ఈ పనిని ఇంట్లో కూర్చునే చేయవచ్చు.
2. ఫ్రీలాన్స్ రైటింగ్
తెలుగు, హిందీ, ఇంగ్లిష్.. ఇలా భాష ఏదైనా సరే.. అందులో పట్టు ఉండి, అనేక అంశాల పట్ల అవగాహన ఉండి వాటిపై ఆర్టికల్స్ రాసే స్కిల్ ఉంటే ఇంట్లో కూర్చునే వెబ్‌సైట్లకు ఆర్టికల్స్ రాసి ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్‌గా కొనసాగవచ్చు. మార్కెట్‌లో ఒక్క ఆర్టికల్‌కు ఇంత మొత్తంలో అని చెప్పి డబ్బు చెల్లిస్తారు. కనుక ఓపిక ఉన్నంత మేర ఆర్టికల్స్ రాసి డబ్బు సంపాదించవచ్చు. ఈ పనిని కూడా ఇంట్లోనే చేయవచ్చు.
3. సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్
ఇది కూడా నిజానికి ఇన్‌స్టాగ్రాం మార్కెటింగ్ లాంటిదే. కాకపోతే ఇందులో అన్ని సోషల్ మీడియా సైట్లు, యాప్ లలోనూ ప్రొడక్ట్స్, సర్వీసుల గురించి మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా కంపెనీలకు ఈ పనిచేసిపెడితే కమిషన్ పొందవచ్చు.
4. ఐటీ స్పెషలిస్టు
అనేక కంపెనీలకు స్కిల్స్ ఉన్న ఐటీ స్పెషలిస్టుల అవసరం తప్పక ఉంటుంది. ఈ వర్క్ ను కూడా ఇంట్లో ఉండే చేయవచ్చు. సరైన ఐటీ కంపెనీలను ఎంచుకుంటే ఎప్పటికప్పుడు పని లభిస్తుంది. దాని ద్వారా డబ్బు కూడా వస్తుంది.
5. గ్రాఫిక్ డిజైనర్
ఈ పనిని కూడా ఇంట్లోనే చేయవచ్చు. ఫొటోషాప్, కొరెల్ డ్రా తదితర గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్లపై చక్కని అవగాహన ఉండడంతోపాటు డిజైన్లను చేసే సత్తా ఉంటే ఇంట్లో ఉండే గ్రాఫిక్ డిజైన్లు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు.
పైన తెలిపిన అంశాలకు గాను ఆన్‌లైన్‌లో స్వల్ప మొత్తంలో చెల్లిస్తే కోర్సులను కూడా అందిస్తున్నారు. వాటిల్లో శిక్షణ తీసుకుని పని చేస్తే ఇంకా మెరుగైన అవకాశాలు ఉంటాయి. అలాగే భవిష్యత్తులో మళ్లీ స్థిరమైన ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఎప్పటికప్పుడు స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటూ ఉంటే సొంతంగానైనా పైన తెలిపిన వర్క్‌లను మరింత సమర్థవంతంగా చేయవచ్చు.