హాస్పిటళ్లలో అప్పుడే పుట్టిన శిశువులు మాయమై మళ్లీ లభిస్తే.. కొన్ని సందర్భాల్లో అలాంటి పిల్లలకు తల్లిదండ్రులం మేమంటే మేము.. అని కొందరు తగవులాడుకుంటారు. దీంతో డీఎన్ఏ పరీక్ష చేసి అసలు ఆ శిశువు తల్లిదండ్రులు ఎవరో గుర్తించి వారికే ఆ శిశువును అప్పగిస్తారు. అయితే మనుషులకు అయితే ఇలాంటి సందర్భాల్లో డీఎన్ఏ టెస్టులు చేస్తారు. కానీ జంతువులకు కూడా చేస్తారా ? అంటే.. అందుకు ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన గోల్డెన్ సిలికాన్ కాలనీలో నివాసం ఉండే జర్నలిస్టు షాదాబ్ ఖాన్ 3 ఏళ్ల వయస్సు ఉన్న తన లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన టైగర్ అనే పేరున్న కుక్క తప్పిపోయిందని ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మలాఖెది ఏరియాకు చెందిన ఏబీవీపీ నాయకులు కార్తీక్ శివహరె ఇంట్లోనూ సరిగ్గా అలాంటి కుక్కే కనిపించింది. దీంతో షాదాబ్ ఖాన్ ఆ కుక్క తనదేనని, తన కుక్కను తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు కార్తీక్ నిరాకరించాడు. అది తన కుక్క అని దాన్ని తాను కొన్నానని, దాని పేరు కల్లు అని తెలిపాడు. దీంతో పోలీసుల రంగప్రవేశం చేశారు.
కాగా షాదాబ్ ఆ కుక్కను 2017లో పాక్‌మర్హిలో కొన్నానని తెలపగా.. కార్తీక్ దాన్ని కొన్ని వారాల కిందటే ఇటార్సీలోని బ్రీడర్ నుంచి కొన్నానని అన్నాడు. దీంతో పోలీసులు అసలు ఆ కుక్క ఎవరికి చెందుతుందో గుర్తించలేక సతమతమయ్యారు. కానీ ఆ కుక్కకు వారు ప్రస్తుతం డీఎన్ఏ టెస్టును చేపట్టారు. దీంతో త్వరలోనే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని అన్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.