ఆ జిల్లాలో అమాత్యుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందు సై అంటే సై అంటున్నారు. అయితే ఎక్కడా విషయం బయటపడకుండా చాప కింద నీరులా పని కానిచ్చేస్తున్నారట. దీంతో ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నరట…
పాలమూరు జిల్లా మంత్రుల మధ్య సఖ్యత కొరవడిందనే టాక్ అధికార పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఏకతాటిపై ఉండి జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సిన అమాత్యులు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారట. తెలంగాణ కేబినెట్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి ఉన్నారు. కీలకమైన వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖలు నిరంజన్‌రెడ్డికి దక్కగా.. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్, పర్యాటక, క్రీడల విభాగాలు దక్కాయి. ఇద్దరూ తొలిసారి మంత్రులైనవారే. అమాత్యులైన కొత్తలో సఖ్యతగా ఉన్నా.. అది ఎంతో కాలం లేదు. చాలా వేగంగా ఆధిపత్య పోరు కు తెరతీశారట. మంత్రులు తలోదారిలో వెళ్తుండటంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గతంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనలోనూ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయంగా చెప్పుకొనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆహ్వానించకుండా.. అన్నీ తానై వ్యవహరించారట మంత్రి శ్రీనివాస్‌గౌడ్. పార్టీలో దీనిపై చర్చ కూడా జరిగింది. అదే సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రుల మధ్య విభేదాలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో సమన్వయంతో వెళ్లాలని ఇద్దరికీ సూచించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టుల పరిశీలనకు మంత్రులు వెళ్లారు. అక్కడికి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ వచ్చినా ఎడమొహం, పెడమొహంగా ఉన్నారట. ఈ కార్యక్రమానికి సంబంధించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీనివాసగౌడ్ గుస్సా అయినట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి కేటీఆర్ టూర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పైచేయి సాధిస్తే.. ప్రాజెక్టుల పర్యటనలో మంత్రి నిరంజన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఆయా పార్లమెంట్ సెగ్మెంట్‌లకు ఇంఛార్జ్‌లుగా ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేదట. నాగర్‌కర్నూల్ సెగ్మంట్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు.. నిరంజన్‌రెడ్డిని కాదని.. శ్రీనివాస్‌గౌడ్‌తో టచ్‌లో ఉన్నారట. మహబూబ్‌నగర్ సెగ్మంట్‌లోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. శ్రీనివాస్‌గౌడ్‌ను కాదని మంత్రి నిరంజన్‌రెడ్డితో జత కట్టినట్లు చెప్పుకొంటున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యేలు సైతం వర్గాలుగా విడిపోవడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. గతంలో జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం లేదని .. అప్పటి పరిస్థితులను తలచుకుంటున్నారట ఎమ్మెల్యేలు. ఏది ఏమైనా తామంతా కేసీఆర్ టీమ్‌లో సభ్యులమంటూ పైకి చెబుతూ.. తెర వెనుక మాత్రం రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారట. మరి.. ఈ పోకడలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.