మోదీకి అనుకూలంగా మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

టైం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్రంపై విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటిసారిగా ఆయనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. బెంగాళ్ అసెంబ్లీలో ప్రసంగించిన దీదీ.. మోదీపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు అసెంబ్లీలో ఉన్న వారంతా షాకయ్యారు. ఇంతకీ దీదీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..?

దేశవ్యాప్తంగా జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులకు సంబంధించి ప్రతిపక్షాలు, విపక్షాలు ఇప్పటికే మోదీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ దుమారం రేపాయి. సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చని దీదీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దూకుడు వ్యవహారానికి కొందరు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే బీజేపీ నేతలు సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు.

“ఇదంతా(రాష్ట్రంలో సీబీఐ దాడులపై) మోదీ చేశారని అనుకోవడం లేదు. భాజపా నేతలే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన అజెండాను, పార్టీ ప్రయోజనాలను వేరుగా చూడాలి. దీనిపై మోదీ చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోంది. ఈ తీర్మానం ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకం కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల పక్షపాత పనితీరుకు మాత్రమే వ్యతిరేకం” అని దీదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news