గోపాలన్ అనే గిరిజనుడిపై చిరుతపులి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం అతడు చిరుతను పదునైన కత్తితో ఎదురుదాడికి దిగాడు. ఈ ఘటనలో చిరుత మృతి చెందింది. ఈ ఘటన శనివారం ఉదయం కేరళ ఇడుక్కిలోని చింగనంకుడిలో జరిగింది.
శుక్రవారం రాత్రి చిరుత.. ఫిఫ్టీ మైల్స్ అనే ప్రాంతంలో సంచరించి రెండు మేకలను చంపేసింది. గత కొన్ని రోజులుగా మంకులం ప్రాంతంలోనూ చిరుత సంచరిస్తోంది. దీంతో అటవీ అధికారులు ఆ ప్రాంతంలో కెమెరాలు అమర్చారు. కెమెరాలో చిరుత పులి సంచరించిన దృశ్యాలు నమోదవ్వగా దానిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే గోపాలన్పై దాడి చేసిందా క్రూరమృగం. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపిన గోపాలన్పై చట్టపరమైన చర్యలు ఉండవని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. గోపాలన్పై కేసు నమోదు చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.