ఫైవ్ స్టార్ హోటల్‌లో బస అంటే.. బిల్లు ఎంత వాచిపోతుందో అందరికీ తెలుసు.. అలాంటి హోటల్లు డబ్బున్నవారికే కానీ సామాన్యులకు కాదు అన్నట్లు ఉంటాయి.. అలాంటి హోటల్‌లో ఓ వ్యక్తి ఏకంగా రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టాడు.. పైగా హోటల్‌లో వెండి వస్తువులు, ముత్యాల ట్రేను కూడా చోరీ చేశాడట. అబుదాబి రాజ కుటుంబం ఉద్యోగినంటూ నమ్మబలికి ఆ హోటల్ సిబ్బందికి కుచ్చిటోపి పెట్టాడు..
మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తిపై ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం ఆగస్టు 1న తమ హోటల్‍లోని 427 నంబర్ రూమ్‍లో షరీఫ్.. చెకిన్ అయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 20వ తేదీ వరకు షరీఫ్ అదే గదిలో ఉన్నాడని తెలిపింది. తాను యూఏఈ పౌరుడినని, అబుదాబి రాజ కుటుంబానికి చెందిన షేర్ ఫలాహ్ జయేద్ అల్ న్యాన్‍కు ముఖ్యమైన ఉద్యోగినని ఆగస్టులో హోటల్ గది కోసం వచ్చినప్పుడు మహమ్మద్ షరీఫ్ అక్కడి సిబ్బందికి చెప్పాడు. షేక్‍కు తాను వ్యక్తిగత ఉద్యోగినని చెప్పాడు. అధికారిక వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చానని, జిబినెస్ కార్డు, యూఏఈ రెసిడెంట్ కార్డు కూడా హోటల్ సిబ్బందికి చూపించాడట. ఇక తనపై అనుమానం రాకుండా తరచూ హోటల్ సిబ్బందితోనూ షరీఫ్ మాట్లాడేవాడట.
నాలుగు నెలలకు గాను రూమ్, సర్వీస్ బిల్లు మొత్తం రూ.35లక్షలు అయింది. దీంట్లో రూ.11.5లక్షలను మహమ్మద్ షరీఫ్ చెల్లించాడు. మిగిలిన రూ.23లక్షలు ఇవ్వకుండానే వెళ్లిపోయాడని లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. కాగా, షరీఫ్‍ను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు దిల్లీ పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహమ్మద్ షరీఫ్ హోటల్‍లో సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. వాటిని నకిలీవిగా అనుమానిస్తున్నారు. అయినా అంత తేలిగ్గా డబ్బులు ఇవ్వకుండా హోటల్ యాజమాన్యం ఎలా వదిలేసిందో.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తిని తిట్టడం మానేసి.. హోటల్ సిబ్బందిదే తప్పు అన్నట్లు కమెంట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంలో పోలీసులు అతిడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ అంత ఈజీగా దొరికేవాడే అయితే.. అంత ధైర్యంగా డబ్బులు ఎగ్గొట్టి పోయేవాడంటారా..?