లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం అనేక మంది తమ సొంత ఊళ్లకు వెళ్లలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ ఎత్తేస్తే తమ సొంత ఊళ్లకు వెళ్లవచ్చని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు, అందుకు ఎంత కాలం వేచి ఉండాలో అస్సలు తెలియదు.. అందుకని.. ఇదంతా బాధపడడం ఎందుకని భావించిన ఆ వ్యక్తి.. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత ఊరికి వెళ్లేందుకు ఏకంగా ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేమిటంటే…
మహారాష్ట్రలోని ముంబైలో నివాసం ఉండే ప్రేమ్ మూర్తి పాండేది అలహాబాద్. ఆ సిటీకి శివారు ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం అతని సొంత ఊరు. ఈ క్రమంలో ముంబై నుంచి అక్కడికి సుమారుగా 1200 కిలోమీటర్లు ఉంటుంది. అయితే లాక్‌డౌన్ వల్ల ముంబైలో చిక్కుకున్న పాండేకి ఓపిక నశించింది. ఎలాగైనా సరే.. సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నాడు. అందుకు అతను ఓ చక్కని ప్లాన్ వేశాడు. రూ.2.32 లక్షలు ఖర్చు పెట్టి కేజీకి రూ.9.10 చొప్పున 25,520 కిలోల ఉల్లిపాయలను అతను కొన్నాడు. అనంతరం రూ.77,500 కిరాయికి ఓ ట్రక్కును మాట్లాడుకుని ఏప్రిల్ 20వ తేదీన ముంబై నుంచి అలహాబాద్ బయల్దేరాడు.
అలా పాండే 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 23వ తేదీ నాటికి తన సొంత ఊరికి చేరుకున్నాడు. అయితే పాండే గురించి తెలుసుకున్న అక్కడి పోలీసులు అతని వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు చేశారు. అతనికి నెగెటివ్ వచ్చింది. దీంతో అతన్ని 14 రోజుల పాటు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉండాలని పోలీసులు ఆదేశించారు. ఇక అతను తెచ్చిన ఉల్లిపాయల లోడును మార్కెట్‌లో విక్రయించనున్నారు. దీంతో అతనికి రెండు విధాలుగా లాభం కలిగినట్లయింది. ఒకటి.. సొంత ఊరుకు చేరుకున్నాడు. రెండోది.. ఉల్లిపాయలను అమ్మడం ద్వారా లాభం వస్తుంది. ఏది ఏమైనా.. పాండే వేసిన ప్లాన్ భలేగా ఉంది కదా..!