దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం మనీశ్ సిసోదియా అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం నుంచి మనీశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. ఆయన్ను అరెస్టు చేసినట్లు సాయంత్రం ప్రకటించింది. విచారణలో అడిగిన ప్రశ్నలకు సిసోదియా సంతృప్తికర సమాధానాలు ఇవ్వనందునే అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. సీబీఐ ఆఫీసు పరిసరాలన్నీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇటీవల మనీశ్ సిసోదియాకు సమన్లు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఆయన ఉదయం 11.12కు దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. దిల్లీ నూతన మద్యం విధానంపై అనేక కోణాల్లో సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దినేశ్ అరోరా సహా ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు. వారితో జరిపిన సంభాషణలపైనా ప్రశ్నించారు. అయితే.. సిసోదియా విచారణకు సహకరించలేదని సీబీఐ అధికారులు చెప్పారు. అనేక విషయాల్లో స్పష్టమైన జవాబులు చెప్పలేదని అన్నారు. అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.