దేశంలో నక్సల్స్ హింస గణనీయంగా తగ్గినట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం నక్సల్స్ దాడులు చాలా వరకు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 2009లో 2,258 ఘటనలు నమోదవగా, 2020 నాటికి 665కి చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నక్సల్స్ హింసాత్మక ఘటనలు 70 శాతం తగ్గాయని తెలిపారు.
ఇదే సమయంలో హింసాత్మక సంఘటనల్లో మరణించే పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య కూడా తగ్గిందని.. దాదాపుగా 80 శాతం మేర మరణాలు కూడా తక్కువయ్యాన్నారు. 2010లో జరిగిన సంఘటనల్లో 1005 మంది మరణిస్తే..2020లో ఇది 183కు చేరిందని నిత్యానంద రాయ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో 53 జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ హింస ఉందని.. గతంలో 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లో నక్సల్స్ ఉనికి ఉండేదని ఆయన సభకు తెలిపారు. 2021లో కూడా నక్సల్స్ కార్యకలాపాలు క్షిణించాయని వెల్లడించారు.