గత కొద్దిరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా పోలీసుల అదుపులోకి ఓ మావోయిస్టు మహిళా నేత రజిత చిక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈమె మావోయిస్టు పార్టీ అగ్ర నేత దామోదర్ భార్య.
తమ కమాండర్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం అందడంతో మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేఖను విడుదల చేశారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ రాసిన ఈ లేఖ జిల్లాలో కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు.
తమ కమాండర్ రజితతో పాటు అదుపులోకి తీసుకున్న మరో నలుగురు దళ సభ్యులను వెంటనే పోలీసులు కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచకుండా ఏదైనా హాని తలపెట్టినా.. ఎన్‌కౌంటర్ చేసినా ప్రభుత్వం, పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.