వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్యం మాత్రం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఆమెకి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఆమెను బ్రతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రీతీ ఘటనపై స్పందించారు బిజెపి నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
నిమ్స్ లో ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన.. వేధింపుల గురించి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కొంత ఉందన్నారు ఈటెల రాజేందర్. ఈ ఘటనకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే చాలా కాలేజీలలో ఇంకా ర్యాగింగ్ కొనసాగుతుందని ఆరోపించారు.