డిమానిటైజేషన్ చేసి 2 వేల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ.విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమైక్య సదస్సుకు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.
అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపాలని అన్నారు. అయితే విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అమరావతి అనేది అసెంబ్లీ సాక్షిగా నిర్ణయించిన రాజధాని అని చెప్పారు జె.డి లక్ష్మీనారాయణ. రైతుల ఆత్మహత్యలపై బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. రైతులకు, కౌలు రైతులకు వేర్వేరుగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సహకరించాలని అన్నారు.