ఏప్రిల్ 30 వరకు “కరోనా” “అన్ లాక్ డౌన్” నిబంధనలు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కరోనా వ్యాప్తి, విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని, అన్ని రాష్ట్రాలు “ఆర్టీ పీసీఆర్” టెస్టుల సంఖ్య 70 శాతానికి పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రజల రద్దీ బాగా ఉండే ప్రాంతాల్లో, పని చేసే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది. అంతరాష్ట్ర రవాణా పై ఎలాంటి ఆంక్షలు విధించరాదని, వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగం చేయాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.