సాగర్‌ ఉపఎన్నిక పై టీఆర్‌ఎస్‌, బీజేపీ కొత్త లెక్కలు

-

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారింది. సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రధాన పార్టీలు అభ్యర్దిత్వం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్దిగా ప్రచారం చేస్తుండగా కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్,బీజేపీలు మాత్రం సామాజిక సమీకరణాలు,ప్రత్యర్ధుల ఎత్తుగడల పై కొత్త లెక్కెలేస్తున్నాయి.

ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక జరుగనుంది. అయితే ఇక్కడ త్రిముఖ పోరా,ద్విముఖ పోరా అన్నది అభ్యర్దుల ఎంపిక,పార్టీల ఎత్తుగడలను బట్టి ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల గోదాలో దిగిన సీనియర్ నేత జానారెడ్డి చాపకింద నీరుల ప్రచారాం చేస్తున్నారు. అయితే అధికార పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ శిబిరాల నుంచే ఎలాంటి ఉలుకు పలుకు లేదు. బై ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చేసినా కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు వేస్తున్న ఎత్తుగడలే రాజకీయంగా చర్చకు కారణం అవుతున్నాయి.

టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల కుటుంబానికి టికెట్‌ ఇస్తారని తొలుత ప్రచారం జరిగినా.. జనారెడ్డిని ఎదుర్కొనేందుకు వారి శక్తి సరిపోదని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇదే వ్యూహంతో వెళ్లి దుబ్బాకలో చతికిలపడింది గులాబీ దళం. దుబ్బాక,గ్రేటర్ ఎదురు దెబ్బల తర్వాత గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం టీఆర్ఎస్ లో కాస్త ఆత్మస్థైర్యాన్ని పెంచింది. ఇప్పుడు ఇదే ఊపును సాగర్‌ ఉపఎన్నికలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరి అభ్యర్థి ఎవరన్నదే పార్టీ కేడర్ ని టెన్షన్ పెడుతుంది.

ఇక బీజేపీ పరిస్థితి దీనికి రివర్స్‌లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం ఎదురుకావడంతో.. సాగర్‌లో రచించే రణతంత్రంపై కమలనాథులు కుస్తీ పడుతున్నారు. బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారో ఇంకా స్పష్టత రాలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగి పల్లాకి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న పేరు సైతం బీజేపీ నేతల్లో చర్చకు వస్తుంది. సాగర్ ఉప ఎన్నికలో కుల సమీకరణలు సైతం కీలకం కానున్నాయి.

బీజేపీ రెడ్డి సామాజికవర్గానికి టికెట్‌ ఇస్తే.. బీసీని బరిలో దించాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ ఉందట. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి పోటీ చేస్తుండటం వల్ల రెడ్డి సామాజికవర్గం ఓట్లు చీలి పరిస్థితి మరింత సానుకూలంగా మారుతుందనే లెక్కల్లో ఉందట గులాబీ శిబిరం. అయితే బీజేపీ కూడా ఇదే వ్యూహంతో తాము కూడా బీసీ సామాజికవర్గానికే టికెట్‌ ఇవ్వాలని అనుకుంటోందట.మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి కూడా రెండు పార్టీలకు ఒత్తిడి ఉండటంతో వీరి లెక్కలు ఎప్పుడు తేలతాయా అన్న ఆసక్తి ప్రధాన పార్టీల నేతల్లో ఆసక్తి రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news