వచ్చే యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పొత్తులపై చిన్న పార్టీలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేము కాబట్టే తక్కువ సీట్లలలో పోటీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మేము పొత్తు పెట్టుకుంటామా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాము, గెలిచి తీరుతామని అసద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఇటీవల కాలంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనల్లో ఉన్నారు. గతంలో హైదరాబాద్ ప్రాంతానికే పరిమితమైన ఎంఐఎంని మహారాష్ట్ర, బీహార్, కర్నాటక రాష్ట్రాల్లో మెల్లమెల్లిగా విస్తరింప చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవల కాలంలో ఆ పార్టీ చాలా బలపడింది. ఔరంగబాద్ ఎంపీ సీటుతో పాటు అక్కడ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలను కనబరిచింది. బీహార్ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. తాజాగా యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.