ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, నిర్వచనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, పీడిక రాజన్నదొర తదితరులు హాజరయ్యారు. పలు దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఔషధాల లభ్యత, డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోందని తెలిపారు. త్వరలో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. మంత్రి బుగ్గన కూడా విశాఖ పరిపాలనా రాజధాని అనే చెప్పారని వివరణ ఇచ్చారు.