తెలంగాణ చరిత్ర సృష్టించింది : మంత్రి జగదీష్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ వేడుకల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని నిర్వహించింది ప్రభుత్వం. దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం అడ్డగూడూరులో శాసన సభ్యులు కిషోర్‌కుమార్‌తో కలిసి హరితోత్సవం లో మొక్కను నాటారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక గ్రీన్ రివల్యూషన్ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని అన్నారు. తొమ్మిదేండ్లలో 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు అటవీశాఖ కే పరిమితమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమం నడిపించిన తీరు గానే, హరిత ఉద్యమం నిర్వహించి, తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని ప్రజలకు అలవాటు చేశారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడమని చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version