ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్ ఉన్న నాయకుడని , ఏ ప్రభుత్వ పథకమైనా మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కష్టాలు దూరమవుతాయన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రాణాలకు ఎదురొడ్డి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వివరించారు.
ఇది ఇలా ఉంటె సూర్యాపేట బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంది. జిల్లా కేంద్రంలో వట్టె జానయ్య అనుచరులు ఆందోళనకు దిగారు. జానయ్యపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట గాంధీపార్క్ సెంటర్ నుంచి జనగాం చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మతో జానయ్య అనుచరులు నిరసన చేపట్టారు. ఎన్నికల్లో తనపై పోటీ చేస్తాడనే భయంతో ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కేసులు ఎత్తివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.