మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. ఓటు రాజకీయాల కోసం బాసర ట్రిపుల్ ఐటీ ని కూడా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓటు రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీని కూడా వాడుకున్న మంత్రి కేటీఆర్ గారి తీరు చూస్తే అత్యంత హాస్యాస్పదంగా ఉన్నది.
క్యాంటీన్‌లో కుళ్లిన ఆహారం, హాస్టల్‌లో మౌలికసదుపాయాలు సక్రమంగా లేక… నిన్న మొన్నటి వరకూ నిరసనల్లో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల్ని అణచివేసేందుకు వారికి కరెంట్ కట్ చేసి, సెల్ ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించి నానా యాతనలకి గురిచేసింది టీఆరెస్ సర్కారు. ఒక దశలో విద్యార్థులకు హామీలిచ్చి మాట తప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు కూడా చెయ్యడంతో పరువు పోతోందని భయపడి ఎట్టకేలకి పరిస్థితుల్ని ఏదో కాస్త సరిచేశారు. ఆ తర్వాతే కేటీఆర్ అక్కడ అడుగుపెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు విద్యార్థుల మధ్య కూర్చుని తాపీగా భోజనం చేసి వెళ్లారు.
విద్యార్థులవి సిల్లీ డిమాండ్స్ అని సబిత కొట్టిపడేస్తే… వాళ్ళ పోరాటం నచ్చిందని, టీవీల్లో చూశానని, ఇది గాంధీగారి సత్యాగ్రహం లాంటిదని కేటీఆర్ ఏవో తప్పించుకునే ముచ్చట్లు చెప్పారు. అసలు ఆ విద్యార్థులు పోరాడిందే టీఆరెస్ సర్కారు మీద… వారి తల్లిదండ్రులు మంత్రి సబిత ఇంటికెళ్లి మరీ ఆందోళన చేశారు. తెలంగాణలోనే ఇంత జరిగితే అదేదో బయటెక్కడో జరిగినట్టు టీవీల్లో, పత్రికల్లో చూశానని కేటీఆర్ చెప్పడం కామెడీ కాక ఇంకేంటి? కేటీఆర్‌తో కలసి భోజనం చేసిన విద్యార్థులు… మంత్రి వచ్చారు కాబట్టే భోజనం బాగుందనడం ఆయనకి అవమానం తప్ప మరొకటి కాదు.
బాసర ట్రిపుల్ ఐటీ పరిణామాలు టీఆరెస్ సర్కారు నిర్లక్ష్య, కర్కశ వైఖరిని బయటపెట్టడమేగాక… అవి మరింత తీవ్రమవుతూ తమ ఓటు బ్యాంకుకి ఎసరు వచ్చే పరిస్థితి కనిపించడంతో కేటీఆర్ పరుగు పరుగున వచ్చి కాకమ్మ కబుర్లు చెప్పి వెళ్లిపోయారు. దేశంలో ఉన్నత విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలని తెలిపే ‘నాక్’ రేటింగ్స్‌లో బాసర ట్రిపుల్ ఐటీ ‘సి’ గ్రేడ్‌కు పరిమితమైంది. ఇందుకు కారకులెవరు? ఈ పరిస్థితి మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి”. అంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.