హైదరాబాద్: బాలానగర్‌లో ఎన్నాళ్ల నుంచో ఉన్న ట్రాఫిక్ కష్టాలు నేటితో తీరనున్నాయి. నిరంతరం గంటల కొద్దీ పడుతున్న వాహనదారుల ఇబ్బందులకు కాసేపట్లో చరమగీతం పాడనున్నారు. బాలానగర్ డివిజిన్ నర్సాపూర్ చౌరస్తా వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నేడు మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయనున్నారు.
2017 ఆగస్టు 21న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి మంత్రి కేటీఆరే శ్రీకారం చుట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 385 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి నిర్మాణం చేపట్టిన ఈ బ్రిడ్జి ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. మొత్తం 1.13 కిలోమీటర్ల పొడవులో ఈ బ్రిడ్జి ఉంటుంది. 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జికి బాబూ జగజ్జీవన్ రామ్‌గా నామకరణం చేశారు. కాసేపట్లో మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.