మెట్రో ట్రైన్ రెండో విడత పనుల శంకుస్థాపన ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. డిసెంబర్ 9వ తేదీన మెట్రో రైల్ రెండో దశ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంపై చర్చించారు మంత్రి కేటీఆర్. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మెట్రో కారిడార్ దోహదపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. శంకుస్థాపన ప్రాంతంలో రెండు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. రేపు మంత్రులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. మైండ్‌స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించిన విషయం విదితమే. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో 31 కి.మీ. పొడవున రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఆధ్వరంలో చేపట్టే ఈ ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇది కాకుండా బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మధ్య మరో 31 కి.మీ మేర మెట్రో విస్తరణ కోసం డీపీఆర్‌ను పంపి కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్.