బంజారా, ఆదివాసీలపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడంతో పాటు 10శాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు, పొడు వ్యవసాయ హక్కులు కల్పిస్తూ జీవో ఇవ్వడం చారిత్రక ఘట్టమన్నారు మంత్రి సత్యవతి. అడగకుండానే అండగా నిలిచారని, గిరిజనుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారన్న మంత్రి సత్యవతి.. వారందరి తరఫున శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్రంలో 45లక్షల మంది గిరిజనులున్నారని, వారి జీవితాల్లో సెప్టెంబర్ 17 ఓ మైలురాయిగా నిలిచిందన్నారు మంత్రి సత్యవతి.
రాష్ట్రం సిద్ధించి తర్వాతనే రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపిందని గుర్తు చేశారని, సీఎం కేసీఆర్ అనేకసార్లు రిజర్వేషన్లు పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి సత్యవతి ఆరోపించారు. విద్య ద్వారానే వికాసం సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను స్థాపించి, నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గరీబ్ హటావో నినాదంతో అధికారంలోకి వచ్చి పేదవారిని మోసం చేసిందని మంత్రి సత్యవతి ఆరోపించారు.