అన్నం పెట్టిన పార్టీపై విమర్శలా : ఈటలపై టీఆర్ఎస్ నేతల ఫైర్

ఈటల రాజేందర్ రాజీనామాను ఇవాళ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామాపై గంట వ్యవధిలోనే స్పందించిన తెలంగాణ స్పీకర్..వెంటనే ఆమోద ముద్ర వేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈటల రాజీనామా చేసే ముందు టీఆర్ఎస్, సిఎం కెసిఆర్ పై విమర్శలు చేశారు. ఇక తాజాగా ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను తప్పులు చేశారని.. అన్నం పెట్టిన పార్టీపై ఈటల దుమ్మెత్తి పోయడం ఎంత వరకు కరెక్ట్ ? అని నిలదీశారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలకు అభ్యంతరం చెబుతున్నామని.. ఏది ధర్మం… ఏది అధర్మం అని ఈటలపై మండిపడ్డారు.

కేసీఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవారు ? ఈటలను అనేక విషయాల్లో కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ లో ఉన్నందుకే ఈటలకు గుర్తింపు అని..దీనిని ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు.  కేసీఆర్ రైతుబంధు ఇవ్వడం తప్పా ? ఆసరా పింఛన్లు ఇవ్వడం తప్పా ? అని నిలదీశారు. బీజేపీని తిట్టి …ఆ పార్టీలోనే ఈటల జాయిన్ అవుతున్నారని విమర్శలు చేశారు. వరవరరావును కేసీఆర్ కలవలేదని ఈటల అంటున్నారని..మరి వరవరరావును జైల్ లో పెట్టించిన పార్టీలోనే ఈటల జాయిన్ అవుతున్నారు కదా ? అని చురకలు అంటించారు.