ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని రాజకీయంగా ఎకగ్రీవాలు మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. అధికారులకు మంత్రి వార్నింగ్ ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేసారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు ఎటువంటి అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరంలేదని ఆయన హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలా నిలుస్తుంది అని స్పష్టం చేసారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది అని ఆయన గుర్తు చేసారు. అనుమతుల్లేకుండా చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అని ఆయన అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు.. బెదిరింపు ప్రకటనలు ఎంత పెద్దవారు ఇచ్చినా లెక్క చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు.
ఉద్యోగులను అస్థిరపరిచే చర్యలను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాం అని ఆయన వివరించారు. విధుల్లో అందరూ క్రియాశీలకంగా, నైతికత, నిబద్ధతతో పనిచేయాలి అని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ రక్షణ తప్పనిసరిగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే.. వ్యవస్థలు శాశ్వతం అన్నది గుర్తుంచుకోవాలి అని సూచించారు.