మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్న విధంగానే రాష్ట్రంలోని మైనార్టీలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జులై 23న జారీ చేసింది. అయితే.. మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే.. ముస్లింలకు పంపిణీ చేయనున్న రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 16వ తేదీకి బదులుగా ఈ నెల 19 నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో పథకం షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మైనారిటీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పథకం అమలులో భాగంగా తొలి దశలో భాగంగా 10వేల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.