ఈనెల 9న భారత్ నుంచి ఓ మిస్సైల్ మిస్ ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. సాధారణ తనిఖీల సమయంలో ప్రమాదవశాత్తు క్షిపణి విడుదలైందని.. మార్చి 9న సాయంత్రం 7 గంటల సమయంలో మిస్సైల్ మిస్ ఫైర్ అయినట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ తరువాత మిస్సైల్ పాకిస్థాన్ భూభాగంలో పడిందని ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడించారు. ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణం విచారణ ద్వారానే తెలుస్తుందని అన్నారు. ఈ ఘటన తర్వాత ఆపరేషన్లు, నిర్వహణ, తనిఖీలకు సంబంధించి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను కూడా సమీక్షిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆయుధ వ్యవస్థకు, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిదిద్దుకుంటాం అని.. మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైనది, సురక్షితమైనదని సభకు హమీ ఇస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.