భట్టి నన్ను అందుకే కలిశారు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

-

తనతో ప్రత్యేకంగా మాట్లాడటానికే భట్టి విక్రమార్క వచ్చారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు దూరమవుతాననే ఆలోచనతోనే కలిసి పనిచేయాలని కోరేందుకు ఆయన తనను కలిశారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కాంగ్రెస్‌ అధిష్ఠానం పట్టించుకోలేదని విమర్శించారు.


రాబోయే రోజుల్లో భాజపా బలం పుంజుకుంటుందని తాను చెప్పానని.. అలాగే జరుగుతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. మునుగోడు ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో సమావేశమవుతానని తెలిపారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని చెప్పారు.

మరోవైపు.. కాంగ్రెస్‌ ఆలోచనలతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆయనేం చెప్పారో నాకు తెలియదు. వినలేదు’’ అని సమాధానం దాటవేశారు. పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించానని చెప్పారు.

‘‘సోనియా, రాహుల్‌పై రాజగోపాల్‌రెడ్డికి చాలా గౌరవం ఉంది. కేసీఆర్‌పై సీరియస్‌గా కొట్లాడుదామని నాతో అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుంది. పదవులు చాలా మంది కోరుకుంటారు.. కానీ కొందరికే వస్తాయి. ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్‌తో చెప్పా. రాజగోపాల్‌ మా ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడేందుకు వచ్చా. ఆయన పార్టీ నుంచి వెళ్తారని నేను భావించడం లేదు.’’’ అని భట్టి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news